మీరు బస్సులో లో ప్రయాణించి ఉంటారు. రైలులో కూడా ప్రయాణించి ఉంటారు. కానీ.., రైల్ బస్ లో ఎప్పుడైనా ప్రయాణించారా? కనీసం దీని గురించి ఎప్పుడైనా విన్నారా? రైల్ బస్ అనేది ఒకటి ఉంటుందని చాలా మందికి అసలు తెలియదు. కానీ.., తూర్పు గోదావరి జిల్లా వాసులకి మాత్రం ఇది సుపరిచితమే. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఏకైక రైల్ బస్ ఉండేది ఇక్కడే కాబట్టి. తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లిలో ఈ రైల్ బస్ ఉంది. ఈ రైల్ బస్ కి ఇండియన్ రైల్వే కి ఎలాంటి సంబంధం లేదు. దీనికి టికెట్స్ ఆ రైలు బండిలో ఇస్తారు. అంటే.., మన ఆర్.టి.సి బస్ లలో ఎలా ఉంటుందో అలా అనమాట. రైలు పట్టాలపైనే వెళ్లే రైలు బస్ పూర్తి స్థాయి రైలు కాదు. అలా అని బస్ కూడా కాదు. ఓ మోస్తారు బుల్లి రైలు అనమాట. దీనికి ఒక్కటే భోగి ఉంటుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు నడిచే ఏకైక “రైలు బస్సు”.
ఈ రైలు బస్సుని 2004 లో ప్రారంభించారు. కాకినాడ లోఉదయం 9:30 బయలుదేరి కొవ్వాడ అర్తలకట్ట, కరప, వాకాడ, వేలంగి, నరసాపురపుపేట, రామచంద్రాపురం, ద్రాక్షారామం, కుండూరు, గంగవరం మీదుగా కోటిపల్లికి 11:00 గంటలకు చేరుకుంటుంది. ఈ గ్రామాలు అన్నిటిని కలుపుతూ సరైన బస్సు సదుపాయాలు లేకపోవడంతో అప్పట్లో ఈ రైలు బస్సుని ప్రారంభించారు. అయితే.., ఇందుకోసం సపరేట్ గా కొత్త ట్రాక్ ఏర్పాటు చేయలేదు. ఓ పాత రైల్వే ట్రాక్ అప్పటికే అందుబాటులో ఉండటంతో ఈ రైలు బస్సుని మొదలుపెట్టారు. తరువాత కాలంలో అన్నీ ప్రాంతాలకి బస్సు మార్గం ఏర్పడ్డా.., ఈ రైలు బస్సు ని మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నారు. కాకినాడ నుండి కోటిపల్లి చేరుకునే ప్రజలకి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా.., పచ్చని పొలాల మధ్య ఈ రైలు బస్ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ జర్నీని ఆస్వాదించడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఆసక్తి చూపిస్తుండటం విశేషం.