దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విపత్కర సమయంలో ఎప్పుడు ఏ దుర్వార్త వినాలో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాను నివారించే మార్గాల్లో ఒకటి వ్యాక్సినేషన్. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా డోసుల మధ్య నిడివి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం సూచించింది.
నిడివి తగ్గింపు కోసం ముందుగా భారత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఓ అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలో కొత్త వేరియంట్ల వ్యాప్తిలో ఉన్న కారణంగా రెండు డోసుల మధ్య నిడివిని తగ్గించాలంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. రెండు డోసుల మధ్య ఇప్పటికిప్పుడు నిడివిని తగ్గించాల్సిన అవసరం లేదు. ఈ విషయమై ఆందోళన అనవసరం. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం సమతుల్యం సాధించాలి. ఇటువంటి విషయాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిందే.
ఈ విషయంలో నిపుణులు తగిన వేదికల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నీతీ అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసి అనుభవం గడిచిన నిపుణులు కొందరు.. టీకాకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌లో భాగస్వాములు అని కూడా డా. పాల్ తెలిపారు. టీకాల మధ్య నిడివిపై జరుగుతున్న చర్చను స్వాగతిస్తూనే ఆయన..శాస్త్రయమైన పద్ధతుల ద్వారానే తుది నిర్ణయానికి రావాలని వ్యాఖ్యానించారు.