తూర్పుగోదావరి- ఒక్కోసారి ఎదుటివారికి సాయం చేయబోయి మనం చిక్కుల్లో పడతాం. మామూలు చిక్కులైతే పరవాలేదు కానీ, ప్రాణాల మీదకు వస్తే.. అవును తూర్పుగోదావరి జిల్లాలో ఒకరి ప్రాణాలు కాపాడబోయి, మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదం నింపింది.
ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీర్ పెదపూడి లక్ష్మీకుమారి, అన్నంపల్లి అక్విడెక్ట్ పై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన ఓ యువకుడు, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ విజయ్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విజయ్ హుటాహుటిన బయల్దేరి అక్విడెక్ట్ దగ్గరకు వచ్చాడు. అంతలోనే గ్రామ వాలంటీర్ లక్ష్మీకుమారి పైనుంచి నదిలోకి దూకేసింది. కౌన్సిలర్ విజయ్ ఆమెను కాపాడేందుకు గోదావరిలోకి దూకాడు. నదిలో కొట్టుకుపోతున్న వాలంటీర్ లక్ష్మీని ఎట్టకేలకు కాపాడగలిగాడు. ఐతే యువతిని కాపాడిన విజయ్, నదిలో గల్లంతయ్యాడు. స్థానికులు వచ్చి నదిలో గాలించగా విజయ్ మృతదేహం దొరికింది.
ఈ విషయం తెలుసుకున్న విజయ్ కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామ వాలంటీర్ లక్ష్మీకుమారి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది అన్నది మాత్రం తెలియలేదు. ఏదేమైనా ఆమెను కాపాడిన విజయ్ ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.