సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ఈ ఔషధాన్ని 2-డీజీ అంటే డీయోక్సీ-గ్లూకోజ్ గా పిలుస్తున్నారు. 2-డీజీ డ్రగ్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఈ ఔషధాన్ని కరోనా రోగుల చికిత్స వినియోగానికి అనుమతించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. 2-డీజీ ఔషధాన్ని నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.
‘వైరస్ ఇన్‌ఫెక్ట్ అయిన సెల్స్‌తో పాటు, శరీరంలో వైరస్ వేగంగా వ్యాపించకుండా అడ్డుకుంటుంది’ అని డీఆర్‌డీవో వెల్లడించింది. ఈ విపత్కర సమయంలో దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా కొవిడ్ రోగులకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ డీఆర్‌డీవో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. కరోనాతో బాధపడే రోగులకు ఈ ఔషధంతో తక్షణం ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో సీసీఎంబీ సహకారంతో డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించారు. సార్స్-కోవి-2 వైరస్‌పై ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని, వైరస్ పెరుగుదలను అడ్డుకుంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. మరో 10 రోజుల్లోనే ఈ పౌడర్ మందు మార్కెట్లోకి వస్తుంది. కరోనా కట్టడిలో 2డీజీ ఔషధం గేమ్ చేంజర్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ ఈ పౌడర్ మందుతో కోవిడ్ రోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.