ఇంటర్నేషనల్ డెస్క్- భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో త్వరితగతిన కొవిడ్ వ్యాక్సిన్ అందరికి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కానీ మన దేశ జనాభాకు అనుగునంగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులు మాత్రం అందుబాటులే లేవు. దీంతో చాలా మంది కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ అందుబాటులో కరోనా వ్యాక్సిన్ ఉన్నా.. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. చాలా మంది అమెరికా యువత కరోనా టీకా వేయించుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త ఆలోచన చేశారు. కరోనా నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గమని జో బైడెన్ గట్టిగా నమ్మారు.
ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనుకున్న సమయం కంటే ముందే బైడెన్ తన లక్ష్యాలను సాధించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది 18 ఏళ్లు పైబడిన యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు అధికారులను ఆదేశించారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గ్రహించారు బైడెన్. దీంతో అమెరికాలోని ఓహియో రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. యువతను వ్యాక్సిన్‌వైపు మళ్లీంచేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
వ్యాక్స్ ఏ మిలియన్.. అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న యువతను లాటరీ విధానంలో ఎంపిక చేసి, విజేతలకు 1 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో 22 ఏళ్ల యువతి రాత్రికి రాత్రి కోటీశ్వరురాలైంది. గత సంవత్సరం ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అబ్బిగైల్ బుగెన్స్కే అనే 22 ఏళ్ల యువతి కరోనా టీకా తొలి డోసు తీసుకుంది. ఈ యువతిని అదృష్టం వరించడంతో జాక్‌పాట్ కొట్టింది. వ్యాక్స్ ఏ మిలియన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం డ్రా తీయగా, లాటరీలో అబ్బిగైల్ బుగెన్స్కే 1 మిలియన్ డాలర్లను గెలుచుకుంది. అంటే మన కరెన్సీలో అక్షరాల 7 కోట్ల రూపాయలు. మరో నెల రోజుల పాటు వ్యాక్స్ ఏ మిలియన్ కార్యక్రమం కొనసాగుతుందని.. మరో నలుగురి విజేతలను ఎంపిక చేసి వారికి కూడా 1 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.