కరోనా కోసులు పెరిగిపోతున్న కొద్ది అందరిలో భయం పెరిగిపోతోంది. పట్టణప్రాంతాల్లో అయితే పరవా లేదు కాని.. పల్లేటూర్లలో అయితే కరోనా సోకిన వారిని మరీ అంటరానివారిగా చూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కరోనా సోకిన వారిని గ్రామ పొలిమేరల్లోకి కూడా రానివ్వడం లేదు. మరి కొందరికేమో కరోనా సోకితే ఇంట్లో ఉండటానికి సరైన సౌకర్యం ఉండదు. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదుగో ఇటువంటి సమయంలో తెలంగాణలో జరిగిన రెండు సంఘటనలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. కరోనా సోకిన ఒకతను బాత్రూంనే బెడ్ రూంగా మార్చేసుకుంటే, మరొకరు చెట్టుపైనే ఉంటున్నాడు. నల్గొండ జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి చెట్టుపైనే బెడ్ రూం ఏర్పాటు చేసుకున్నాడు. అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివనాయక్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. కరోనా వల్ల తరగతులు నిలిచిపోవడంతో గత కొన్నిరోజులుగా గ్రామంలోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కోరోనా వచ్చింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ అని తేలింది.
ఐతే శివనాయక్ ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో ఏంచేయాలో తోచలేదు. చివరికి తన ఇంటి సమీపంలోని ఉన్న చెట్టునే బెడ్ రూంగా ఎంచుకున్నాడు. చెట్టుపై మంచాన్ని గట్టిగా తాళ్లతో కట్టి దానిపైనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. గత తొమ్మిది రోజులుగా ఇదే విధంగా చెట్టుపైన శివనాయక్ ఉంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారం గ్రామంలో అశోక్ అనే వ్యక్తి భార్యా,పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల అతనికి కరోనా సోకింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే అశోక్ మాత్రం ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు ఎక్కడ వైరస్ సంక్రమిస్తుందోనని భయపడ్డాడు. దీంతో ఇంటికి కాస్త దూరంలో నిర్మించుకున్న బాత్‌రూమ్‌నే ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. ఈ వ్యక్తి పరిస్థితి జిల్లా వైద్యాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. స్థానిక ఎంపీడీవో ద్వారా వివరాలు సేకరించి అనంతగిరి గుట్టలోని ఐసోలేషన్ కేంద్రానికి అతన్ని తరలించారు. కరోనా బాధితుడు అశోక్‌కి రెండు ఇళ్లు ఉన్నాయని, ఐనా బాత్‌రూమ్‌లో ఉంటున్నాడని గ్రామస్తులు చెప్పారు.