రోజూ పెరుగుతున్న నిత్యవసర ధరలను చూసి సామాన్యుడికి రాత్రుళ్లు నిద్ర రావడం లేదు. చాలీచాలని జీతం, ఆకాశానంటిన ధరలతో మధ్య తరగతి వ్యక్తి అల్లాడిపోతున్నాడు. పెట్రోల్, డీజిల ధరలు మండిపోతుంటే, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగి గుది బండలాగ మారాయి. ఇలా అన్ని ధరలు మండిపోతున్న సమయంలో సామాన్యుడికి ఓ శుభవార్త. వంట నూనెల ధరలు లీటర్ పై రూ.10 నుంచి రూ.12 వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. వివరాల్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో వంటనూనె ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో రికార్డు స్థాయికి చేరడంతో సామాన్య జనం బెంబేలెత్తి పోతున్నారు. కరోనా ప్రభావం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో వంటనూనెల దిగుమతి తగ్గి ధరలు పెరిగాయాని వ్యాపారులు, ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితలు మెరుగపడతుండటంతో నూనె ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా లీటర్ పై రూ. 10 నుంచి 12 వరకు తగ్గే అవకాశం ఉంది. మే నుండి ఖర్చులు మరియు స్టాక్ లపై చర్చించడానికి.. ఆయిల్ ఉత్పత్తిదారులతో మూడు సార్లు సమావేశమైంది. జూలై 6న సమావేశం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో రిటైల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను అభ్యర్థించింది.
దీంతో ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖతో వంటనూనెలపై రేట్ల తగ్గింపునకు ఆమోదం తెలిపింది. లీటర్ పై రూ.10-12 వరకు తగ్గించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ ప్రతినిధులను కోరినట్లు రాబోయే రెండు వారల్లో అన్ని ప్రధాన బ్రాండ్ ల వంట నూనెల ధరల విషయంలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతి దారుగా ఉన్న భారత్ తన దేశీయ అవసరాలకు మలేషియా, ఇండోనేషియాపై ఆధారపడుతోంది. ఏటా 13.5 మిలియన్ టన్నుల వంటనూనెను దేశం దిగుమతి చేసుకుంటుంది. యేటా ఇండోనేషియా నుంచి 4 మిలియన్ టన్నుల మేర పామాయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటుంది.
గతంలో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో భారత్ లోనూ ధరలు పెరిగాయి. అయితే మే నుంచి మళ్లీ ఇండోనేషియా ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ లభిస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో భారత్ లోనూ వంట నూనెల ధరలు తగ్గే అవకాశంఉన్నట్లు తెలుస్తోంది. మరి.. వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రపాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.