న్యూ ఢిల్లీ- కరోనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్య ఎన్నికపై ప్రభావం చూపుతోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఏఐసీసీ నిబంధనల మేరకు జూన్ 23న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉంది. ఐతే భారత్ లో కరోనా పరిస్థితుల నేపధ్యంలో పార్టీ అధ్యక్ష్య ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెెన్స్ ద్వార జరిగిన ఈ సమావేశంలో దేశంలో కరోనా పరిస్థితితో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై సోనియా గాంధీ స్పందించారు.
గత సీడబ్ల్యూసీ సమావేశంలో జూన్ నెలాఖరు కల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల పూర్తి చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ప్రస్తావనకు రాగానే, మెజారిటీ సభ్యులు దేశంలోని ప్రస్తుత కరోనా పరిస్థితులను ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నిక నిర్వహించడం సరికాదని, వాయిదా వేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పార్టీ అధ్యక్షుడి ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి. ఐతే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తేదీని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధారిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు చెప్పాయి.