న్యూ ఢిల్లీ- మీలో ఎంత మంది మధ్యం సేవిస్తారు.. ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు.. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహూల్ గాంధీ. ఇక అడిగింది ఎవరినో తెలుసా.. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను. అదేంటీ పార్టీ సమావేశంలో మందు గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అనే కదా మీ సందేహం. ఇది రాహూల్ గాంధీ ఏదో క్యాజువల్ గా అడిగిన ప్రశ్న కాదు.
అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ నుంచి వారికి ఊహించని ప్రశ్న ఎదురయ్యింది. కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నవారు ఖాదీ ధరించడం, మద్యానికి దూరంగా ఉండాలన్న నిబంధనలు ఉన్నాయట. అందుకే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పీసీసీ చీఫ్ లను ఈ ప్రశ్న అడిగారు. రాహూల్ హఠాత్తుగా అడిగిన ప్రశ్నకు నేతలంతా తెల్లమొహాలు వేశారు.
రాహూల్ గాంధీ నుంచి ఈ ప్రశ్నను ఊహించని నేతలంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంచెప్పాలో పాలుపోని స్థితిలో ఉండగా, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. మా రాష్ట్రంలో చాలా మంది మద్యం తాగుతారు.. అని ఆయన చెప్పారు. దీంతో రాహూల్ గాంధీకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు మద్యం ముట్టరాదనే నిబంధనను మహాత్మా గాంధీ సూచించారు. ఇదే విషయాన్ని తన ఆత్మకథలో కూడా రాశారు. ఐతే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సభ్యత్వం కోసం నిబంధనలలో మార్పు అవసరం అయినప్పటికీ అది ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ నిబంధనలను మార్చే అధికారం పార్టీ వర్కింగ్ కమిటీకి మాత్రమే ఉంది.
దేశవ్యాప్తంగా నవంబరు 1 నుంచి పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవనుండగా, మరోసారి ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సభ్యులు కొనసాగాలనుకునే వ్యక్తులు నమోదు పత్రంలోని వ్యక్తిగత డిక్లరేషన్ గా మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి 10 పాయింట్లను జాబితాను పూర్తిచేయాల్సి ఉంటుంది. కొత్త సభ్యులు కూడా బహిరంగంగా పార్టీ విధానాలు, కార్యక్రమాలను ఎప్పుడూ విమర్శించకూడదని హామీ ఇవ్వాలి.