న్యూ ఢిల్లీ- హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక, ఇతర సైనికుల మరణం పట్ల అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.
రావత్ తో పాటు సైనికుల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సోనియా గాంధీ ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 9న గురువారం తన పుట్టినరోజు వేడుకలను జరపకూడదని సోనియా గాంధి నిర్ణయించుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేయడం, పూల మాలలు వేయడం, ఆనందోత్సాహాల ర్యాలీలు వంటి ఎలాంటి వేడుకలను చేయకూడదని సోనియా గాంధి స్పష్టం చేశారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణం మధ్య తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేనని సోనియా ప్రకటించారు. ఈమేరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐతే దేశవ్యాప్తంగా ఇప్పటికే చేపట్టిన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ డ్రైవ్ ను మాత్రం కోనసాగించవచ్చని ఏఐసిసి కార్యాలయం స్పష్టం చేసింది.
ఇదే సమయంలో సోనియా పుట్టిన రోజు నేపధ్యంలో కేక్ కటింగ్‌లు, వేడుకలు, ఆడంబరాలు ప్రదర్శన లేకుండా సభ్యత్వ డ్రైవ్ కార్యక్రమాలు మాత్రమే చేయాలని పార్టీ ఆదేశించింది. అంతకు ముందు గురువారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ మరియు ఇతర సైనిక సిబ్బందికి నివాళులు అర్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను మొదలుపెట్టాలని ఏఐసిసి అన్ని రాష్ట్రాల పీసిసిలకు సూచించింది.