చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు తన తండ్రి కరుణానిధి అంటే చాలా ఇష్టం. కరుణానిధి చనిపోయే వరకు స్టాలిన్ ఎప్పుడూ ఆయన మాటకు ఎదురు చెప్పే వారు కాదట. అంతే కాదు తండ్రి ఏంచెప్పినా తూచా తప్పకుండా ఆచరించేవారట స్టాలిన్. ఇదిగో ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత కూడా తండ్రి కరుణానిధి పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటారు స్టాలిన్. మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెన్నై గోపాల పురంలోని ఇంటికి వెళ్లి అక్కడ తన తల్లిని, సోదరిని కలిశారు. తన తండ్రి కరుణానిధి ఫోటో కు నమస్కరిస్తూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో స్టాలిన్ సోదరి ఆయనను సముదాయించిందట. ఇక తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్ ప్రజా సంక్షేమానికి సంబందించిన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. స్టాలిన్ సంతకాలు చేయడం కోసం వాడిన పెన్ను గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
స్టాలిన్ ఉపయోగించిన పెన్నును ఆయన తండ్రి, దివంగత సీఎం కరుణానిధి వాడేవారట. ఆ పెన్నుతోనే స్టాలిన్ ముఖ్యమంత్రి హోదాలో తెలి సంతకాన్ని చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలతో పాటు, డీఎంకే పార్టీ వర్గాలు సైతం గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఇక కరుణానిధికి ఫౌంటెన్ పెన్నులంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెప్పారు. కరుణానిధి ఎప్పుడూ చెన్నైలోని నేతాజీ సుభాశ్ చంద్రబోస్ రోడ్డులోని ఓ దుకాణంలో వాలిటీ 69 ఫౌంటేన్ పెన్నులను కొనేవారట. కరుణానిధి సినిమాలకు కధలు రాసే రోజుల నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన టైం వరకు వాలిటీ 69 ఫౌంటేన్ పెన్నులనే వాడేవారని డీఎంకే నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ తండ్రి వాడిన వాలిటీ 69 ఫౌంటేన్ పెన్నుతోనే తొలి సంతకం చేశారన్నమాట. ఇది తండ్రి పట్ల స్టాలిన్ కు ఉన్న సెంటిమెంట్ అని కొందరంటే, గౌరవమని మరికొందరంటున్నారు.