హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈనెల 22న తన పర్యటనకు సంబందించిన విషయాన్ని స్వయంగా సీఎం ఆ గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈనెల 22 వ తేదీన మీ గ్రామానికి వస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో ఆ సర్పంచ్ ఆనందానికి అవధుల్లేవు. తన పర్యటనకు కావాల్సిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి సర్పంచ్‌కు వివరించారు. గ్రామంలో రెండు రకాల కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని సీఎం తెలిపారు.
గ్రామస్తులందరికి సహ పంక్తి భోజనాలు తానే స్వయంగా ఏర్పాటు చేస్తానని సీఎం సర్పంచ్ కు చెప్పారు. తాను కూడా ఉర్లోవారందరితో కలిసి అక్కడే భోజనం చేస్తానని తెలిపారు. భోజనాల తరువాత గ్రామ సమస్యలపై ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని, అక్కడ మాట్లాడుుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యకు చెప్పారు. గ్రామస్తులందరికి సరిపోయేలా భోజనం వండేందుకు హైదరాబాద్ నుంచి టీమ్ ముందే అక్కడికి వస్తుందని సీఎం తెలిపారు. ఈ ఏర్పాట్ల విషయంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షిస్తారని అన్నారు.
తన పర్యటన సందర్బంగా ఎలాంటి చిల్లర రాజకీయాలకు తావు లేకుండా ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకోవాలని సీఎం కేసీఆర్ సర్పంచ్ కు సూచించారు. తన ఇంటికి కూడా రావాలని సర్పంచ్ సీఎం కేసీఆర్ ను కోరగా, తప్పకుండా వస్తానని చెప్పారు. వాసాలమర్రి గ్రామ పర్యటన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ సందర్శనకు వెళ్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ది పనులను పరిశీలించాక, తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు.