చెన్నై- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వీరిరువురి భేటీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఈ సమావేశంలో దేశ రాజకీయాలతో పాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్నతీరుపై ఇద్దరు సీఎంలు చర్చించారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పున ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. వచ్చే యేడాది మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయని కేసీఆర్, స్టాలిన్ కు వివరించారు. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్ ను కేసీఆర్ కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ తమిళనాడు వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు ఆయన సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య తదితరులు తరలివెళ్లారు.
స్థానికంగా ఓ హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆలయానికి వెళ్లిన కేసీఆర్ బృందానికి తమిళనాడు పురపాలకశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ, కలెక్టర్ శివరావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందు ఆలయ గజరాజు వద్ద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్ కుటుంబీకులు, ఆ తరువాత శ్రీరంగనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.