హైదరాబాద్- తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల మాదిరిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రాజకీయవర్గాల్లో సీరియస్ గా చర్చ నడుస్తోంది. అందుకు సన్నద్దంగా ఉండాలని పొలిటికల్ పార్టీలు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పందించారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. 103 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో జరిగే తలాతోకా లేని ప్రచారాన్ని నమ్మవద్దని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమస్యే లేదని తేల్చి చెప్పారు కేసీఆర్. ఇక బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి కేటాయింపులు లేకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి తనకు తాను ఆత్మ వంచన చేసుకుని, దేశ ప్రజలను ఘోరంగా వంచించారని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శించారు. దళితులు, గిరిజన సంక్షేమంపై కేంద్రానికి చిత్త శుద్ధి లేదన్నారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు ఊసే లేదని మండిపడ్డారు. యూరియా సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత పెట్టారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి.