హైదరాబాద్- 12 మెట్ల కిన్నెర కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య గురించి చాలావరకు అందరికి తెలిసిందే. అంతరించి పోతున్న 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో మొగులయ్య సుపరిచితుడే. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకులకు చెందిన దర్శనం మొగులయ్య తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నాడు.
తాత ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తన కళను అందరికీ పరియచం చేస్తున్నారు. మొగిలయ్య వాయించే పరికరాన్ని మెట్ల కిన్నెర అంటారు. దాన్ని భుజాన పెట్టుకొని పాడే పాటను సాకి అంటారు. స్థానికంగా దొరికే వస్తువులతో ఈ కిన్నెరను తయారు చేస్తారు. తన ముందు తరాల పేర్లు చెప్పి ఈ వాయిద్యం ఎక్కడి నుంచి మొదలైందో వివరిస్తూవస్తున్నారు మొగిలయ్య.
ఆ పాటల్లోని వ్యక్తుల చరిత్రలు కూడా తన పూర్వీకులు శృతి కట్టినవే అని చెబుతారు. ప్రస్తుతం ఈ సంప్రదాయ వాద్యాన్ని వాయించేది మొగిలయ్య ఒక్కరేనని చెప్తున్నారు. మొగిలయ్య గళం సినిమా పాట వరకూ చేరడంతో ఆయన రాత్రికి రాత్రే పాపులర్ అయ్యారు. ‘ఆడా గాదు, ఈడా గాదు, అమీరోళ్ల మేడా గాదు.. పుట్టిండాడు పులిపిల్ల.. అంటూ సాగే ఈ సాకి యూట్యూబ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట పాపులర్ అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొగిలయ్యని అభినందించడంతో పాటు ఆర్థిక సాయం కూడా చేశారు.
పవన్ సినిమాలో పాట పాడటం తన అదృష్టమని చెప్పారు మొగిలయ్య. ఇదిగో ఇటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో మొగులయ్యను సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు.