సమాజం అభివృద్ధి అనేది.. కుటుంబాలను నిర్మించే స్త్రీల చేతుల్లోనే ఉంటుంది. వారి సాధికారికత సాధ్యం అయిన నాడే సమాజం కూడా బాగుంటుంది. అలాంటి మహిళల ఎదుగుదలకి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకి వేసింది. మహిళలు, బాలికల, ఆరోగ్యం పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్ఛ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో 7వ తరగతి నుంచి 12వ తరగతికి వరకు చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేయనున్నారు.
నెలకు 10 చొప్పున, రెండు నెలలకి ఒకసారి ఈ న్యాప్కిన్స్‌ను అందిస్తారు. ఇంతేకాదు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్‌లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.., ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. ఈ నాటికీ 45 శాతం మంది బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో లేవు. వీరిలో 23 శాతం బాలికలు చదువులు మధ్యలో ఆపేయడానికి ఇదే ప్రధాన కారణం. ఈ కారణంగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.