రాజమండ్రి- నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. అఖండ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఐతే ఓ ఎగ్జిబ్యూటర్ హఠాన్మరణం చెందడంతో విషాదం నెలకొంది.
తూర్పుగోధావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తి రామకృష్ణ హఠాన్మరణం చెందారు. గురువారం రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లో అఖండ సినిమా చూస్తుండగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో రామకృష్ణ థియేటర్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ధియేటర్ యాజమాన్యం వెంటనే రామకృష్ణను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఐతే రామకృష్ణ అప్పటికే మృతి చెందారు. రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ ఓనర్ గా, జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసో సియేషన్ అధ్యక్షుడిగాను, వింటేజ్ క్రియేషన్స్ అధినేతగాను, జేకే రెస్టారెంట్ అధినేతగాను అందరికి జాస్తి రామకృష్ణ సుపరిచితులు.
ఆయనకు భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాస్తి రామకృష్ణ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఫిల్మ్ డిస్ర్టిబ్యూటర్స్ అసోసియేషన్, సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చల్లా శంకర్రావు, వింటేజ్ క్రియేషన్స్ మేనేజింగ్ పార్టనర్ ప్రసాద్, అనిల్‌రెడ్డి తదితరులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.