రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఢీ షో ఫ్యాన్స్, బుల్లితెర అభిమానులు కొరియోగ్రాఫర్ చైతన్య మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న డాన్స్ మాస్టర్ ఇలా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఢీ డాన్స్ షోతో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య అందరినీ కలచివేస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి, ఎంతో మంచివాడు ఇలా సూసైడ్ చేసుకోవడం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ముఖ్యంగా తోటి కళాకారాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్లు, తెలుగు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అప్పుల బాధతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వివరించాడు. అయితే ఒక్కసారి చైతన్య నోరు తెరిచి అందరితో మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది అంటూ వాపోతున్నారు. ఈ సందర్భంగానే చైతన్యకు సంబంధించిన అన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చైతన్య ఎంత గొప్ప కొరియోగ్రాఫర్ అనేది అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా సందర్భాల్లో తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైజాగ్ లో ఒక స్టేజ్ షో కోసం డాన్సర్స్ ని ఏర్పాటు చేయాలంటూ ఒకరు చైతన్యకు కాల్ చేశారు. అతనితో చైతన్యకు ముందు నుంచే పరిచయం ఉంది. డాన్సర్ ఐశ్వర్యను షో కోసం మాట్లాడాలని కోరతారు. అయితే ఐశ్వర్యకు వేరే షూట్ ఉందని ఇంకొక డాన్సర్ ని మాట్లాడతాను అంటూ చైతన్య చెప్పుకొస్తాడు. అలా స్టేజ్ షోకి సంబంధించి వారి మధ్య సంభాషణ జరిగింది.
అయితే ఇది చైతన్య ఆఖరి ఫోన్ కాల్ అని చెబుతున్నారు. కానీ, ఇది జనవరిలో జరిగిన సంభాషణలా అనిపిస్తోంది. ఈ ఫోన్ కాల్ లోనే చైతన్యకు సదరు వ్యక్తి ఒక సాంగ్ ఆఫర్ కూడా ఇచ్చాడు. 10 మంది కుర్రాళ్లతో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటూ కోరుతాడు. అయితే చైతన్య లైఫ్ లో నిలదొక్కుకునేందుకు ఇటు ఢీతో పాటుగా బయట షోస్ కూడా చేసేవాడు. అలాగే అతనికి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ, ఇలా అర్థాంతరంగా తన జీవితాన్ని ముంగించేసుకున్నాడు. చైతన్య మాస్టర్ ఎప్పుడూ డాన్స్ గురించే ఆలోచిస్తాడని, ఎప్పుడూ కెరీర్ గురించే మాట్లాడతాడంటూ ఈ ఫోన్ కాల్ విన్న అభిమానులు, తోటి కొరియోగ్రాఫర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం మాత్రం కాదనే విషయాన్ని గుర్తించాలి. ఎంతటి సమస్య అయినా నిలబడి పోరాడేందుకే ప్రయత్నించాలి. అయిన వారితో మీ సమస్యను చెప్పుకుంటే పరిష్కార మార్గాలు కూడా దొరికే అవకాశం లేకపోలేదు.