ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికలపై వివాదం చలరేగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కమిటీ కాలపరిమితి ముగియడంతో ఎన్నికలపై తర్జనభర్జన కొనసాగుతోంది. ‘మా’ బరిలో చాలా మంది పోటీ పడుతుండటంతో గందరగోళం నెలకొంది. ‘మా’ ఎన్నిక నేపధ్యంలో తెలుగు సినీ పరిశ్రమలోని వర్గాలు బయటపడుతున్నాయి.
ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి లేఖ ఇండస్ట్రీలో ఆసక్తకరంగా మారింది. ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు వెంటనే జరపాలని చిరంజీవి ‘మా’ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. ‘మా’ కమిటీ పదవి కాలం ముగిసిన నేపధ్యంలో, సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు చిరంజీవి. ‘మా’ ఎన్నికలపై చాలా మంది సభ్యులు బహిరంగంగా మాట్లాడుతున్నారని, దీని వల్ల సంస్థ ప్రతిష్ఠ మసకబారుతోందని చిరంజీవి ఆవేధన వ్యక్తం చేశారు.
అందుకే సాధ్యమైనంత త్వరగా ‘మా’ ఎన్నికలు జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును కోరారు చిరంజీవి. మీరు పరిశ్రమలో పెద్దవారు.. మొదటి నుంచీ జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలుసు.. సంస్థ ప్రతిష్ఠను మసకబారుస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి.. అని లేఖలో కృష్ణంరాజును కోరారు.
ఇక ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కొత్తగా నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం లేదని, గతంలో ఉన్న నిధుల్ని ఖర్చు చేస్తూ తానే స్వయంగా చేస్తున్నట్టు చెబుతున్నారని నటి హేమ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. హేమ వ్యాఖ్యలు అర్థరహితమనీ, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని నరేష్ చెప్పుకొచ్చారు.