ఫిల్మ్ డెస్క్- విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఈ రోజు. తెలుగువారి మదిలో చెరగని ముద్రవేసి, వారి హృదాయాల్లో సుస్థిరంగా ఉందిపోయారు ఎన్టీఆర్. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన స్థానాన్ని తిరిగి ఎవరు భర్తీ చేయలేదు.. భవిష్యత్తులోను చేయలేరని చెప్పడం ఏమాత్రం అతియోశక్తి కాదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్బంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబ సభ్యులతో పాటు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ యుగపురుషుడు, పేదల పెన్నిదని బాలయ్య కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ పై ఎంతో మంది పుస్తకాలు రాశారని.. కానీ ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకురావాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ట్విట్టర్ వేధికగా ఆయనను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్లు.. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు.. నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. అని చిరంజీవి ట్వీట్ చేశారు.
అప్పట్లో ఎన్టీఆర్ నటించిన తిరుగులేని మనిషి చిత్రంలో చిరంజీవి ఓ ప్రధాన పాత్రలో ఆయనతో కలిసి నటించారు. అది తన అదృష్టమని చిరంజీవి చాలా సందర్బాల్లో చెప్పారు. ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు నివాళులర్పించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా తాము ఈ సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లలేకపోతున్నామని ఎన్టీఆర్ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ చెప్పారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ రంగానికి, ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.
మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది.. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక సీనియర్ చరయిత పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ.. ఆయన కారణజన్ముడు, ఆయన తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయాల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాలవారిని ఆదుకున్న మహానుభావుడు, ఆయనే తెలుగు వారి అన్నగారు నందమూరి తారక రామారావు, అన్నగారి జయంతి శుభాకాంక్షలు.. అని ట్వీట్ చేశారు.