ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీమా ఇండస్ట్రీలో మంచి డ్యాన్సర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడంటే చాలా మంది కొత్త వాళ్లు వచ్చారు గానీ, మొన్నటి వరకు చిరంజీవిని మించిన డ్యాన్సర్ లేరనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్లు చిరంజీవితో డ్యాన్స్ చేయాలంటే భయపడేవాళ్లని ఎన్నో సందర్బాల్లో వాళ్లే చెప్పారు. మరి అలాంటి మెగాస్టార్.. ఓ హీరోయిన్ పక్కన డ్యాన్స్ చేసి తనను తాను డ్యాన్సర్ గా నిరూపించుకుంటానని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
అది కూడా చిరంజీవి స్వయంగా చెప్పారు. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరి ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవిని చిరంజీవి సరదాగా ఆటపట్టించారు. తనతో సాయిపల్లవి నటించనని చెప్పిందని, ఆమె నో చెప్పిందుకు చాలా సంతోషంగా ఉన్నానని చిరంజీవి అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి అసలు ఏమన్నారంటే.. ఇటీవల నేను చేయాలనుకున్న చిత్రంలో చెల్లిలి పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించడం జరిగింది.. అయితే ఆమె ఈ చిత్రంలో చేసేందుకు ఒప్పుకోలేదు.. నాకు కూడా ఆమె అంగీకరించకుండా ఉంటేనే బాగుండు అనిపించింది. ఆమె చేయను అని చెప్పాక చాలా సంతోషం వేసింది.. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్‌తో డ్యాన్స్ చేయాలని కోరుకుంటాను కానీ.. చెల్లెలిగా అంటే నాకే మనసు అంగీకరించలేదు.. అన్నారు.
అంత మంచి డ్యాన్సర్ సాయిపల్లవి.. ఫిదా సినిమా టైమ్‌లో కూడా వరుణ్ ఓ పాటను చూపించి.. తన డ్యాన్స్ ఎలా ఉంది అని అడిగాడు.. అప్పుడు నేను.. నిన్ను చూడలేదురా.. సాయిపల్లవినే చూస్తుండిపోయాను అని చెప్పా.. అందుకే సాయిపల్లవితో డ్యాన్స్ చేసి.. నేను కూడా డ్యాన్సర్‌నే అని ప్రూవ్ చేసుకుంటాను.. అని చెప్పుకొచ్చారు చిరంజీవి.
చిరంజీవి మాట్లాడుతుండగానే సాయిపల్లవి మైక్ తీసుకుని.. మీ మాటలు చాలా గౌరవంగా భావిస్తున్నాను సార్.. నిజంగా నేను మీ సినిమాలో చేయను అని చెప్పలేదు.. నేను రీమేక్ సినిమాలను చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను.. నా దగ్గరకు ఎవరు వచ్చినా.. ముందుగా నేను అడిగే ప్రశ్న.. ఈ చిత్రం రీమేకా అని అడుగుతాను.. అందుకే చేయనని చెప్పాను.. తప్ప వేరే ఎటువంటి ఉద్దేశ్యం లేదు సార్.. అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. దీంతో అమీర్ ఖాన్ తో సహా అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.