తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. ప్రజా సేవకుడు, ప్రకృతిని ఆరాదించే గొప్ప వ్యక్తి.. మంచి భావుకుడు. మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు ప్రకృతిని తన కెమెరాలో బంధిస్తూ అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం చిరంజీవి క్వారంటైన్ లో ఉన్నారు.
మెగాస్టార్ సూర్యోదయాన్ని ఎంతో రమణీయంగా వీడియో రూపంలో చిత్రీకరించారు. చీకట్లను చీల్చుకుని భానుడు పైపైకి వస్తున్న దృశ్యాలను ఆ వీడియోలో చూసి తీరాల్సిందే. ప్రాతఃకాలంలో సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉంటుందో చిరు కళ్లకు కట్టినట్టు చూపించారు. కాగా, తన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న చిరు, తన మనోభావాలను కూడా వ్యక్తం చేశారు.
‘‘నేటి ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా ఉన్న నెలవంక, దానికి దగ్గర్లోనే శుక్ర గ్రహం, ఉదయించబోతున్న సూర్యుడు… ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలగినట్టుగా ఉంది’’ అంటూ భావయుక్తంగా తెలియజేయడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.