దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత తీరినా.., ఆక్సిజన్ సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.., రాబోయే థర్డ్ వేవ్ ని ఎదుర్కోవాలి అంటే ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్స్ అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన కార్యచరణలు సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ.., ఈ లోపే ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి మనసున్న మహారాజులు, మానవతావాదులు ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా నేను సైతం అంటూ ఈ మంచి పనికి నడుం బిగించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలోను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని, నా కుమారుడు రామ్ చరణ్ తేజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ముందుకి సాగుతుందని చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు.
చెప్పిన మాట ప్రకారం మెగాస్టార్ తన సేవా కార్యక్రమాన్ని గుంటూరు నుండి మొదలుపెట్టారు. తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో తొలి ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేశారు. అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. మొత్తం రూ.10కోట్ల నిర్మాణంతో ఈ ప్లాంట్స్ నిర్మించినట్టు తెలుస్తోంది. రానున్న కాలంలో మిగతా అన్నీ జిల్లాలలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్లాంట్స్ నిర్మించబోతోంది. ఆక్సిజన్ అందని కారణంగా ఇకపై తెలుగు రాష్ట్రాలలో ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న ఆలోచనతోనే మెగాస్టార్ చిరంజీవి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక లాక్ డౌన్ మొదలైన నాటి నుండి చిరంజీవి సినీ కార్మికుల కుటుంబాలకి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో టి.ఎన్.ఆర్ కుటుంబానికి, పావలా శ్యామలా వంటి మరి కొంతమందకి ఆయన ఆర్ధిక సాహయం అందించిన విషయం తెలిసిందే. ఏదేమైనా ఒకవైపు పరిశ్రమకి పెద్ద దిక్కుగా, మరోవైపు ప్రజల మనిషిగా చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.