హైదరాబాద్- మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. సోమవారం కరోనాతో మరిణించిన నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి ఆయన బాసటగా నిలిచారు. టీఎన్ ఆర్ ఫ్యామిలీకి తక్షణ ఖర్చుల కోసం చిరంజీవి లక్ష రూపాయలు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చినట్లుగా టీఎన్ఆర్ చాలా సందర్భాలలో చెప్పారు. అనుకున్న విధంగానే వైవిద్యమైన పాత్రల్లో నటించడమే కాకుండా పలు సినిమాలకు కధా సహకారం అందించారు టీఎన్ ఆర్. ఇక మీడియా ద్వార టీఎన్ఆర్ మృచి చెందిన విషయం తెలుసుకున్న చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. టీఎన్ఆర్ భార్యా, పిల్లలకు ఫోన్ చేసిన చిరంజీవి వారిని పరామర్శించారు. అంతే కాదు వారి కుటుంబానికి తక్షణ ఖర్చుల కోసం లక్ష రూపాయలు పంపించారు.
టీఎన్ఆర్ చేసిన చాలా ఇంటర్వ్యూలు తాను చూశానని, ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకుందని ఈ సందర్బంగా చిరంజీవి గుర్తుచేసుకున్నారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. టీఎన్ ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి చెప్పారు. టీఎన్ ఆర్ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇక తన భర్త టీఎన్ ఆర్ తన 200వ ఇంటర్వూ మీతో చేయాలని ఆయన అంటుండేవారని ఫోన్ చేసిన సందర్బంగా చిరంజీవితో చెప్పింది టీఎన్ ఆర్ సతీమణి. ఇంత వరకు మిమ్మల్ని కలవలేదని, ఇలా తన భర్త చనిపోయినప్పుడు ఫోన్ చేసి దైర్యం చెప్పడంతో పాటు, ఆర్దిక సాయం చేసినందుకు ఆమె చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పింది.