ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పద్మావతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(సెప్టెంబర్ 13) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న ఉత్తేజ్ చిరును చూడగానే ఒక్క సారిగి తీవ్ర భావోద్వేగానకి లోనయ్యారు.
అన్నయ్య.. అన్నయ్య అని అభిమానించే చిరంజీవిని పట్టుకుని కన్నీరుమున్నీరయ్యారు. చిరంజీవి కాళ్లమీద పడి ఉత్తేజ్ ఏడుస్తుండంతో చిరంజీవి సైతం భావోద్యేగానికి లోనయ్యారు. చేతన చిరుని పట్టుకుని ఏడుస్తున్న సన్నివేశం చూసి అక్కడ ఉన్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. చిరంజీవి వెంట ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, బ్రహ్మాజితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్ ను పరామర్శించారు. చేతనను జీవిత ఓదార్చే ప్రయత్నం చేశారు. చిరంజీవి అంటే అమితంగా అభిమానించే ఉత్తేజ్ కష్ట సమయంలో ఆయన ఓదార్పుతో భావోద్వేగానికి లోనయ్యారు. పలు సందర్భాల్లో మెగాస్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఉత్తేజ్. చిరంజీవికి కూడా ఉత్తేజ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. కాగా పద్మావతి.. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. అంతేగాక ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.