శంషాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవార ఆరో రోజు సమారోహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సమతా మూర్తిని దర్శించుకుని, యాగ శాలలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞంలో పాలు పంచుకున్నారు.
ఈ సందర్బంగా చిన జీయర్ స్వామి సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయినానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న జగన్ ను అభినందిస్తున్నట్లు చినజీయర్ స్వామి చెప్పారు. ప్రతి పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు చిన జీయర్ స్వామి.
విద్య, వయస్సు, ధనం, అధికారం.. ఈ నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరని చెప్పిన చిన జీయర్ స్వామి, సీఎం జగన్‌లో ఇవన్నీ ఉన్నా ఎలాంటి గర్వం లేదని చెప్పారు. సీఎం జగన్ అందరి సలహాలను స్వీకరిస్తారని, సలహాలను పాటిస్తారని చిన జీయర్ స్వామి అన్నారు. వైస్ జగన్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో చిన జీయర్ స్వామి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ తనకు బాగా తెలుసని, ఆయన ముఖ్యమంత్రి కాకముందు వచ్చి తనను కలిశారని చెప్పారు. అన్ని వర్గాల అభ్యన్నతి కోసం వైఎస్సార్ పని చేశారని చిన జీయర్ స్వామి కొనియాడారు. తండ్రి లాగే ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నానని చిన జీయర్ స్వామి అన్నారు.