పెళ్లి మండపంలో ఒక్కసారిగా భయంకర ఘటన చోటు చేసుకుంది. వివాహం చూడటానికి వచ్చిన ఓ యువతి.. ఉన్నట్లుండి వధూవరులపై యాసిడ్ విసిరింది. మరి నిందితురాలు ఎందుకు ఇలా చేసింది అంటే..
పెళ్లి ఇళ్లు అంటే ఎంత సందడిగా ఉంటుంది.. పచ్చని పందిళ్లు.. బంధువుల హడావుడి, చిన్నారుల కేరింతలతో కోలాహలంగా ఉంటుంది. తమ కళ్ల ముందే ఎదిగిన బిడ్డలు.. పెరిగి పెద్దయ్యి.. వారి జీవితాల్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని తల్లిదండ్రులు ఆనందంతో భావోద్వాగానికి గురవుతుంటే.. ఇన్నాళ్లు తమ మీద ఎలాంటి బాధ్యతలు లేవు.. ఇక మీదట కుటుంబం బాధ్యత చేతుల్లోకి రాబోతుందని ఆలోచిస్తూ.. ఒకింత కంగారుకు గురవుతూనే.. తమ భాగస్వామిని తలుచుకుని.. ఊహాలోకంలో తేలిపోతుంటారు కాబోయే వధూవరులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వివాహ వేదిక వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఓ భయంకర సంఘటన చోటు చేసుకుంది. పీటల మీద ఉన్న వధూవరులపై యాసిడ్ దాడి జరిగింది. ఆ వివరాలు..
ఈ భయంకర ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. తనను ప్రేమించి.. మోసి చేసి మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. ఏకంగా పెళ్లి మండపానికి వెళ్లి.. పీటలపై ఉన్న వధూవరుల మీద యాసిడ్ దాడి చేసింది ఓ యువతి. చత్తీస్‌గఢ్, బస్తర్ జిల్లా, భాన్‌పూరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దమృధర్ బఘెల్ అనే యువకుడికి, నిందితురాలికి మధ్య గత ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో బాధితుడు.. నిందితురాలిని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. కానీ తాజాగా ఆమెకు తెలియకుండా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. తనను మోసం చేసిన యువకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది.
దానిలో భాగంగా.. ఈ నెల 19న సాయంత్రం.. తన లవర్ వివాహం జరుగుతున్న ఛోటే అమాబాల్ ప్రాంతానికి వెళ్లింది. ముందుగానే పక్కా ప్లాన్‌తో ఉన్న యువతి.. తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటం కోసం మగాళ్ల వేషధారణలో అనగా.. ప్యాంట్, షర్ట్ ధరించి కళ్యాణ మండపానికి వచ్చింది. సమయం కోసం వేచి చూడసాగింది. ఈ సమయంలోనే బలమైన గాలులు వీయడంతో కరెంట్ పోయింది. ఇదే అవకాశం అని భావించిన యువతి.. వధూవరులపై యాసిడ్ విసిరి.. చీకటిలోనే అక్కడి నుంచి పరార్ అయింది. కరెంట్ పోవడంతో చుట్టూ చీకటి.. ఇంతలోనే పెళ్లి మండపం నుంచి పెద్దగా కేకలు.. దాంతో ఏం జరిగిందోనని అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. లైట్ ఆన్ చేసి చూడగా.. మండపం మీద నూతన వధూవరులతో పాటు.. మరి కొందరు తీవ్ర గాయాలతో విలవిల్లాడుతూ కనిపించారు. ఇక ఈ ఘటనలో వధూవరులతోపాటు దాదాపు 12 మంది గాయపడ్డారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం గురించి తెలియగానే భాన్‌పురి పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా.. ముందు గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసినట్లు కేసు నమోదు చేసున్నారు. నిందితుల కోసం గాలించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. చివరగా ప్రేమించిన యువతే.. ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి వివరాలు సేకరించారు. తనను మోసం చేసినందుకే యాసిడ్ దాడి చేసినట్లు ఒప్పుకుంది. తనతో అబద్ధం చెబుతూ.. పెళ్లి విషయం దాచిపెట్టాడని తెలిపింది. అల్లం శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనంతో దాడి చేసినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.