విజయవాడ- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే సామాన్యులకే కాదు పోలీసులకు సైతం వెన్నులో వణుకు పుడుతుంది. చెడ్డీ గ్యాంగ్ చేసే దొంగతనాలు, దోపిణీలే ఇందుకు కారణం. అవును చెడ్డీ గ్యాంగ్ చేసే దొంగతనాలు చాలా భాయంకరంగా ఉంటాయి. చడీ చప్పుడు కాకుండా ఇళ్లల్లోకి వచ్చి దొరికినంతా దోచుకుపోవడం చెడ్డీ గ్యాంగ్ స్టైల్. ఎవరైనా అడ్డొస్తే దాడి చేయడనాకి, అవసరమైన హత్య చేయడానికి కూడా వెనుకాడదు చెడ్డీ గ్యాంగ్.
అందుకే చెడ్డీ గ్యాంగ్ అంటేనే అందరికి చచ్చేంత హడల్. ఆఖరికి పోలీసులకు కూడా. అప్పుడెప్పుడో హైదరాబాద్ లో హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్, ఇప్పుడు విజయవాడలోకి ఎంటరైంది. దీంతో విజయవాడ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ వచ్చీ రాగానే విజయవాడ నగరంలో అలజడి సృష్టించింది. సిటీలోని చిట్టీనగర్ లో చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఉన్న శివదుర్గ అపార్ట్ మెంట్లోకి ప్రవేశించి డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లింది చెడ్డీ గ్యాంగ్.
సోమవారం ఉదయం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఫ్లాట్ నెంబర్ జి18లోని మొదటి అంతస్థులో ఈ చోరీ జరిగింది. దొంగతనంపై చిట్టీనగర్ పోలీస్ స్టేషన్లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజులు క్రింత విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడిన విషయం తెలిసిందే.
చెడ్డీలు ధరించి, ముఖాలకు మాస్కులు వేసుకుని, ఒంటికి ఆముదం పూసుకుని తెల్లవారు జామున అంతా మంచి నిద్రలో ఉన్న టైంలో చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుంది. చెడ్డీ గ్యాంగ్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టినా సరే, వారు మాత్రం చిక్కడం లేదు. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవాలని పోలీసులను విజయవాడ వాసులు కోరుతున్నారు.