దేశంలో ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దేశీయ బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, ఆ తర్వాత ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపార వేత్తలున్నారు.అలాగే సామాన్యుడి డబ్బును కాజేసి, వారిని ముంచేస్తున్న కంపెనీలున్నాయి. వాటిల్లో చిట్స్ ఫండ్ కంపెనీలే అధికం. అలా మోసానికి పాల్పడిన ఓ కంపెనీ యజమానికి చారిత్రాత్మక శిక్షనే వేసిందో కోర్టు
దేశంలో ఆర్థిక మోసగాళ్లకు కొదవలేదు. మోసపోయే వాళ్లు ఉండాలే కానీ వారికి తెలియకుండా కిడ్నీలు, కళ్లు కూడా అమ్మేయగల సత్తా ఉన్న చోరులున్నారు. బ్యాంకులను మోసం చేసి.. వాటికి రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్తలున్నారు. లిక్కన్ బారన్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ, ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో పాటు ఆ జాబితా పెద్దగానే ఉంది. వీరంతా పేరు మోసిన వ్యక్తులు. అదేవిధంగా చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి.. సామాన్యులకు నుండి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి.. ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్న కంపెనీలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ చీటింగ్ కేసులో చిట్ ఫంట్ కంపెనీ యజమానికి ఏళ్ల తరబడి జైలు శిక్షను విధిస్తూ.. చారిత్రాత్మక తీర్పుకు నాంది పలికింది. ఇంతకు ఆ కోర్టు ఎక్కడ ఉందంటే..?
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చి వార్తల్లో నిలిచింది. చిట్ ఫండ్ కంపెనీ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి, బోర్డు తిప్పిన ఆ సంస్థ యజమానికి ఏకంగా 250 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఆ కంపెనీ పేరు సాయి ప్రసాద్ చిట్ ఫండ్స్. ఆ సంస్థ యజమాని బాలా సాహెబ్ భాస్కర్‌కు 250 ఏళ్ల శిక్ష విధిస్తూ సెహోర్ జిల్లా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ కుమార్ షాహితో కూడిన ఏక సభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 2009 నుండి 2016 వరకు నిందితులు భాస్కర్ తో సహా దీప్‌సింగ్ వర్మ, లఖన్‌లాల్ వర్మ, జితేంద్ర కుమార్, రాజేష్ పర్మార్‌లు మా సంస్థలో పెట్టుబడులు పెట్టండని, అవి డబుల్ అవుతాయంటూ మాయమాటలు చెప్పి సామాన్యుల నుండి కోట్లలో డబ్బులు వసూలు చేశారు.
5 ఏళ్లల్లో రెండింతలు డబ్బులు వస్తాయన్న ఆశతో వాళ్ల మాయ మాటలు నమ్మి అనేక మంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే డబ్బులు చెల్లించే సమయానికి ఉద్యోగులు కంపెనీకి తాళం వేసి పరారీ అయ్యారు. యజమానిని ఫోన్లో ప్రశ్నించగా.. మీ డబ్బులు ఎక్కడికి పోలేదని, ఇస్తామంటూ కబుర్లు చెప్పాడు. అయినప్పటికీ చెల్లించకపోవడం తో కంపెనీకి చెందిన కస్టమర్లు డబ్బులు వసూలు చేసేందుకు కంపెనీ కార్యాలయానికి చేరుకోగా.. తాళం వేసి ఉండటంతో షాక్ తిన్నారు. 2016లో సెహోర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఆర్‌ఐ నమోదైంది. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ డైరెక్టర్‌కి కోర్టు 250 ఏళ్ల శిక్ష విధించింది. అంతేకాకుండా యజమానికి రూ. ఆరు లక్షల 50 వేల ఫైన్ విధించింది.