న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న జనానికి నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను కొంత మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్య తరగతి వారికి ఇది నిజంగా తీపి కబురే అని చెప్పవచ్చు.
దీపావళి పండగ సందర్బంగా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఈ తగ్గింపు ధరలు గురువారం 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కొంతమేర ఐనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర తగ్గించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కూడా చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని సూచించింది. అలా ఐతే ప్రజలపై మరి కొంత భారం తగ్గుతుందని తెలిపింది. మరి కేంద్ర ప్రభుత్వ సూచనను ఏ మేరకు రాష్ట్రాలు పరిగణలోకి తీసుకుంటాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీ సర్కార్ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే జనానికి కాస్త ఊరట లభిస్తుంది.
పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గడంతో గురువారం నుంచి హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 109.49 కి చేరనుండగా, డీజిల్ ధర లీటరుకు 97.40 కి చేరనుంది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 111.61 కి చేరనుండగా, డీజిల్ ధర 98.89 కి చేరనుంది.