న్యూ ఢిల్లీ- ప్రభుత్వాలు ఒక్కోసారి భలే విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటాయి. సర్కార్ నిర్ణయాల వల్ల చాలా వరకు ఇబ్బంది పడేది సామాన్యులే. ఇదిగో ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మరోసారి సమాన్య, మధ్య తరగతివైరిపై భారం పడనుంది. అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆటోలపై పడింది.
అవును కేంద్ర ప్రభుత్వం తాజాగా సామాన్యులకు ఝలక్ ఇచ్చింది. సామాన్యుల ట్యాక్సీ అయిన ఆటో ఎక్కే వారికి షాకిచ్చింది. ఓలా, ఉబర్ వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అంటే ఆన్ లైన్ లో ఆటో బుక్ చేసుకొని ప్రయాణిస్తే ఇకపై జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.
ఆటో ప్రయాణం వచ్చే కొత్త యేడాది నుంచి మరింత భారం కానుంది. ఆన్ లైన్ లో ఓలా, ఊబర్ లాంటి యాప్ ల ద్వార ఆటోను బుక్ చేసుకుంటే చార్జీకి అదనంగా 5 శాతం జీఎస్‌టీ పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఓలా, ఉబెర్ తో పాటు మరి కొన్ని యాప్ లు ఆన్ లైన్ లో రవాణా సేవలను అందిస్తున్నాయి. ఐతే ఆటోలు ఎక్కే వారికిపై దీని ప్రభావం ఉంటుంది.
ఐతే సాధారణంగా ఆటోలు ఎక్కి డబ్బులు చెల్లించే వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్రం తెలిపింది. ఇలా మామూలుగా బయట ఆటో ఎక్కే వారికి జీఎస్‌టీ వర్తించదు. కేవలం ఆన్ లైన్ లో ఆటోలు బుక్ చేసుకొని ప్రయాణం చేసే వారిపైనే జీఎస్‌టీ పడుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏదేమైనా ఈ నిర్ణయం సామాన్యులపై భారం మోపడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.