న్యూఢిల్లీ- కేంద్ర క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. ఈ రోజు బుధవారం సాయంత్రం 6 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మోదీ క్యాబినెట్ లోకి రాబోతున్న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల గురించి ఇంకా ఉత్కంఠ నెలకొంది. మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు.. సామాజిక వర్గాల వారిగా ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయోనే విషయంపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.
మంత్రి వర్గ విస్తరణలో బడుగు, బలహీన, తాడిత, పీడిత, వంచిత, ఆదివాసీ, అణగారిన వర్గాలకు పెద్ద పీట వేయబోతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి మెదీ క్యాబినెట్ లో మహిళలకు కీలక పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. మోదీ క్యాబినెట్ లో మంత్రి పదవులు దక్కే వారిలో సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింథియా, నారాయణ్ రాణే, పశుపతి పరస్, పంకజ్ చౌదరి, రీటా బహుగుణ జోషీ, అనుప్రియ పటేల్, రామ్‌శంకర్ కథేరియా, వరుణ్ గాంధీ, ఆర్‌సీపీ సింగ్, లల్లన్ సింగ్, రాహుల్ కశ్వన్, సీపీ జోషీ తదితర పేర్లు వినిపిస్తున్నాయి.
జ్యోతిరాదిత్య సింథియా, రామ్‌శంకర్ కథేరియా, నారాయణ్ రాణే ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావుకు సైతం మోదీ క్యాబినెట్ లో స్థానం దక్కనుందని సమాచారం. మంత్రి వర్గంలోకి తీసుకునేవారికి ఇప్పచికే ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది.