భారత దేశంలో చాలా మంది దొంగబాబాలు ప్రజలకు మాయ మాటలు చెబుతూ కోట్లు సంపాదిస్తున్నారు. మనుషుల బలహీనతను ఆసరాగా చేసుకొని వారిని నిట్టనిలువునా దోచేస్తున్నారు. మరికొంత మంది దొంగబాబాలు అయితే ఆడవారిని లైంగిక వేధింపులు.. అత్యాచారాలు చేస్తు పట్టుబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారిలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఒకరు.
భక్తి ముసుగులో అనేక అకృత్యాలకు పాల్పడి ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నామహ డేరా బాబా. తన ఆశ్రమంలో శిష్యురాళ్లను అత్యాచారం చేసిన కేసులో డేరా బాబా భాగోతం మొత్తం బయట పడింది. తాజాగా డేరా బాబా ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సహా పలువుర్ని కోర్టు దోషిగా తేల్చింది. డేరా బాబా తన శిష్యుడైన రంజిత్ సింగ్‌ను 2002 జులై 10న మరో ఐదుగురితో కలిసి హత్య చేశారు. రంజీత్ సింగ్ కుమారుడు జగ్షీర్ సింగ్ ఫిర్యాదు మేరకు 2003 డిసెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సీబీఐ కోర్టు విచారిస్తోంది. ఈ కేసును పంచకుల కోర్టు నుంచి రాష్ట్రంలోని మరేదైనా సీబీఐ కోర్టుకు మార్చాల్సిందిగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అటువంటి అవసరమేమీ లేదని హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే పంచకులలోని సీబీఐ కోర్టు కేసులో తీర్పును వెలువరించింది.
డేరా బాబాతో పాటు మరో ఐదుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 12న శిక్షను విధించనుంది. కాగా, డేరా బాబా ఇప్పటికే రెండు కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తన ఆశ్రమంలో శిష్యులుగా ఉన్న ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసులో 2017 ఆగస్టులో పంచకుల సీబీఐ కోర్టు డేరా బాబాను దోషిగా తేల్చి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. డేరాలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసి వారిపై లైంగి వేధింపులే కాదు.. అత్యాచారాలకు పాల్పపడుతున్నారని వార్త కథనాలు రాసిన జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతిని చంపిన కేసులోనూ దోషిగా తేలుస్తూ 2019లో కోర్టు తీర్పు ఇచ్చింది.