తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల క్యాసినోలు నిర్వహిస్తూ క్యాసినో కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు చికోటి ప్రవీణ్ కుమార్. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు
క్యాసినో కింగ్‌గా పేరు తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల క్యాసినోలు నిర్వహిస్తుండటంతో ఆయనకు క్యాసినో కింగ్‌గా పేరొచ్చింది. ఆయన ఫాం హౌస్ లో పలు రకాల జంతువులు, పాములు పెంచుతూ ఉంటారు. తన క్యాసినో గురించి, రాజకీయ నేతలతో తనకు ఉన్న పరిచయాల గురించి బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఆయనకే తలనొప్పి తెప్పించారు ఆగంతకులు. తాజాగా చికోటి ప్రవీణ్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లోని ఆయన కారును కొట్టేశారు ఆగంతకులు.
సైదాబాద్‌లోని ఇంట్లో పార్కింగ్‌లో ఉన్న ఇన్నోవా కారును దొంగలించారు. ఆయన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి, కారు తాళాలు వెతికి, వాటిని దొంగిలించి ఇన్నోవాతో పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటివీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దొంగతనంపై సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్ పిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులు అయినట్లు సమాచారం. అయితే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగు చూసినట్లు తెలుస్తోంది. తన ఇంటిని రెక్కీ నిర్వహించి, తన కారును పట్టుకెళ్లిన ఆగంతకులు తక్షణమే పట్టుకోవాలని పోలీసులను కోరారు. అయితే తనకు ప్రాణహాని ఉందని.. పోలీసు ప్రొటెక్షన్ కావాలని చాలా రోజులుగా ప్రభుత్వాన్ని ప్రవీణ్ అడుగుతున్నారు.
గతంలో కూడా సైదాబాద్‌లో ప్రవీణ్ చికోటి ఇంటి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాటి నుంచే తనకు ప్రాణహాని ఉందని చికోటి ప్రవీణ్ చెబుతున్నారు. తనతో పాటు కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని పోలీసులను అడిగినా ఇవ్వట్లేదని చికోటి ప్రవీణ్ అనుచరులు సైతం చెబుతున్నారు. కాగా.. కేసినో వ్యవహారంలో ఈడీ ఎదుట రోజుల తరబడి విచారణకు హాజరైన సంగతి విదితమే. ఇప్పుడు తన కారును కొట్టేశారని, దానిపై చర్యలు తీసుకోవాలని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.