నిర్మల్- గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడిక్కడ వరద చేరడంతో ఉర్లకు ఊర్లు జలమయం అయ్యాయి. తెలంగాణలోని చాలా వరకు జిల్లాలన్నీ నీట మూనిగాయి. కొన్ని ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు జలదిగ్భంధంలో ఉన్నాయి. దీంతో ఎక్కడిక్కడ ప్రజా జీవనం స్తంబించిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరద బీభత్సంతో జనజీవనం అస్థవ్యస్తం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయి, మరి కొన్ని చోట్ల ఇళ్లు నీట మునిగిపోయి ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలో వరద నీరు స్థానికంగా ఉన్న శ్మశానాన్ని ముంచెత్తింది. దీంతో స్తానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలోని శ్మశాన వాటిక భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉదృతి పెరగడంతో నీటిలో మునిగిపోయింది. ఒక్కసారిగా పెరిగిన వరద నీటితో వైకుంఠ ధామంలో కాలిపోతున్న ఓ శవం కొట్టుకుపోయిన విషాద ఘటన స్థానికంగా చోటుచేసుకుంది. చితిమంటల్లో కాలిపోతున్న శవం చుట్టు ముట్టు నీరు చేరడంతో ఒక్కసారిగా మంటలు ఆరిపోయాయి. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో మృతదేహం నీళ్లకు కొట్టుకుపోయింది.
దీన్ని గమనించిన వైకుంఠధామం కాపరులు, మృతుడి బంధువులు వెంటనే నీటిలోకి వెళ్లి శవాన్ని బయటికి తీశారు. ఇక చసేది లేక శవాన్ని గోతిలో పాతిపెట్టారు. వరద నీటిలో ఇలా శవాలు కొట్టుకుపోవడం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజు క్రితం సైతం ఇలాగే జరిగిందని వాపోతున్నారు. వర్షాలు పడినన్ని రోజులు ఈ కష్టాలు తప్పవని ఖానాపురం వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.