ఇంటర్నేషనల్ డెస్క్- సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే ఎలాగోలా తప్పించుకోవచ్చు. స్వల్ప గాయాలతో, లేదంటే కనీసం అంగవైకల్యంతో బయటపడవచ్చు. కానీ విమాన ప్రమాదాలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ కు ఏమైనా జరిగిందా ఇంక అంతే సంగతులు. చాలా అరుదైన సందర్బాల్లో విమాన ప్రమాదాల నుంచి కొంత మంది ప్రాణాలతో బయటపడుతుంటారు.
ఇంగ్లండ్ లో ఓ విమాన ప్రమాదం నుంచి అంతా సేఫ్ గా బయటపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పండగను జరుపుకొందామని ఆనందంగా వెళ్తున్న సుమారు 200 మంది, విమాన ప్రమాదంతో జీవితంపై ఆశలు వదులుకున్నారు. కానీ అనూహ్యంగా సురక్షితంగా ఫ్లైట్ రన్ వేపై ల్యాండ్ అయ్యింది.
డిసెంబర్ 22న లండన్ లోని గాట్విక్ నుంచి 200మంది ప్రయాణికులతో బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 777 విమానం బయలుదేరింది. క్రిస్మస్ సందర్భంగా తమ బంధువులను కలుసుకునేందుకు ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. విమానం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, హఠాత్తుగా పెద్ద శబ్ధం వినిపించింది. ఒక్కసారిగా విమానం మొత్తం ఒక కుదుపుకు లోనైంది. ఏం జరుగుతందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ప్రయాణీకులంతా భయంతో వణికిపోయారు.
అసలేం జరిగిందంటే.. ఈ విమానానికి వెయ్యి అడుగుల ఎత్తులో మరో జెట్ విమానం ప్రయాణిస్తోంది. ఆ విమానం పైనుంచి ఓ మంచుగడ్డ వేగంగా వచ్చి బోయింగ్777 పై పడింది. దీంతో విమానం విండ్ స్క్రీన్ బీటలు వారింది. రెండు అడుగుల మందం ఉన్న బుల్లెట్ ఫ్రూం అద్దం బీటలు వారడంతో ప్రయాణికులతో పాటు, పైలెట్లు కూడా ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఐతే ఫ్లైట్ అద్దం పూర్తిగా పగలకపోవడంతో పైలట్లు ఊపిరి పీల్చుకున్నారు.