దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా అనాదిగా వస్తున్న ఆచారాలు మాత్రం పోవడం లేదు. అందులో ఆడ పిల్లల పెళ్లికి అడ్డంకిగా ఉన్న వరకట్నం ఒకటి. వరకట్నం తీసుకోవడం నేరమని తెలిసినా కూడా.. దీనికి డిమాండ్ తగ్గడం లేదు. పోనీ వరకట్నంతో అత్తింటి వారూ సరిపెడుతున్నారా అంటూ.. అదనపు కట్నం పేరుతో హింసిస్తున్నారు. అయితే అలా అదనపు కట్నం కోసం వేధించిన వరుడి కుటుంబానికి దిమ్మతిరిగే షాక్ నిచ్చింది వధువు కుటుంబం.
మగవాళ్లు ఎక్కువ ఆడవాళ్లు తక్కువ అనే సమాజం నుండి ఇద్దరూ సమానమే అనే స్థాయికి చేరుకున్నాం. అయినా ఇప్పటికీ యువతికి వివాహం చేయాలంటే వరకట్నం చెల్లించాల్సిందే. ఆడపిల్లను చదివించడానికి, పెంచడానికి అవ్వనంత ఖర్చును ఆమె పెళ్లికి కూడబెడుతున్నాడు తండ్రి. కోరినంత వరకట్నం ఇవ్వలేక అనేక మంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురౌతున్నారు. కట్నం ఇచ్చి పంపినా ఆడపిల్లను తిరిగి అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటివారు ఆరళ్లు పెడుతున్నారు. తన పెళ్లికి పెట్టే ఖర్చు కోసమే తండ్రి అప్పులు చేశాడన్న బాధతో.. పుట్టింటి వాళ్లను అడిగి తీసుకు రావడం ఇష్టంలేని యువతి.. అత్త వారింట్లో ఇబ్బందులకు గురవుతుంది. ఇవి ఎక్కువ అవ్వడంతో ఒక్కోసారి ప్రాణాలు తీసుకుంటున్నారు. దేశంలో వరకట్న వేధింపుల కారణంగా అనేక మంది మహిళలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. అయితే అదనపు కట్నం అడిగిన వరుడికి దిమ్మతిరిగే షాక్ నిచ్చింది వధువు కుటుంబం.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాకు చెందిన ఓ వరుడు వివాహానికి ముందు అదనపు కట్నం కింద ట్రాక్టర్‌ను ఇవ్వాలని వధువు కుటుంబాన్ని డిమాండ్ చేశాడు. అయితే వరుడి అత్యాశకు చూసిన వధువు కుటుంబ సభ్యులు అతడికి బుద్ధి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. వసీం అహ్మద్ అనే యువకుడికి ఓ మహిళతో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి ముందు అదనపు కట్నం కింద తనకు ట్రాక్టర్ కావాలని వరుడు పట్టుబట్టాడు. దీంతో చేసేదేమీ లేక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు వధువు తల్లిదండ్రులు. ఓ ట్రాక్టర్‌ను ముస్తాబు చేసి పెళ్లి మండపానికి తీసుకు వచ్చారు. పెళ్లి ఊరేగింపుగా వరుడు కుటుంబ సభ్యులు వధువు ఇంటికి చేరుకున్నారు. అయితే వెంటనే వరుడు కుటుంబాన్ని వధువు కుటుంబ సభ్యులు బంధించారు. వధువును కాదు ట్రాక్టర్ ను పెళ్లి చేసుకోవాలంటూ ట్విస్ట్ ఇచ్చారు.
అయితే ఈ ఘటనతో ఖంగుతిన్నాడు పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు. వధువు ఈ పెళ్లిని చేసుకోనని చెప్పేయడంతో వివాహం రద్దు అయ్యింది. అంతేకాకుండా పెళ్లికి అయిన ఖర్చంతా ఇవ్వాలని వధువు కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో .. అంగీకరించారు వరుడు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటనపై పెళ్లి కూతురు మేనమామ మాట్లాడుతూ..పెళ్లికి ముందే ఒప్పుకున్నట్లు లక్షలు ఖర్చు చేసి అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేశాము. కానీ వీటికి సంతృప్తి చెందని వరుడు కుటుంబం అదనపు కట్నంగా ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేశాడు. దీంతో తన మేన కోడలు పెళ్లికి ఆసక్తి చూపించలేదని అందుకే పెళ్లి కొడుక్కి అలా బుద్ధి చెప్పామని చెప్పుకొచ్చాడు.