ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ సినిమా స్టార్ ఆమిర్ ఖాన్ కాకినాడ వచ్చారు. అమీర్ ఖాన్ ఏంటీ, కాకినాడ రావడమేంటి అని అనుకుంటున్నారా.. అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కోసం కాకినాడకు వచ్చారు. బుధవారం అర్ధరాత్రి తరువాత అమీర్ ఖాన్ కాకినాడ చేరుకున్నారు. కాకినాడలోని స్టార్ హోటల్ సరోవర్ పోర్ట్‌కో లో అమీర్ ఖాన్ బస చేశారు.
ఉప్పాడ బీచ్, కాకిననాడ పోర్టు, అమలాపురం సమీపంలో ఓడలరేవు బీచ్ తో పాటు కాకినాడలోని ఇతర ప్రముఖ ప్రాంతాల్లో జరిగే షూటింగ్‌లో ఆమిర్ ఖాన్ పాల్గొననున్నారు. అమీర్ ఖాన్ గురువారం మొత్తం సరోవర్ పోర్ట్‌కో హోటల్‌లోనే ఉండిపోయారు. అమీర్ ఖాన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు హోటల్ వద్దకు చేరుకున్నారు. ఐతే ఆయన బయటకు రాకపోవడంతో వారంతా నిరాశతో వెళ్లిపోయారు.
శుక్రవారం నుంచి అమీర్ ఖాన్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర బృందం తెలిపింది. అమీర్ ఖాన్ కు హోటల్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక లాల్ సింగ్ చద్దా ఓ ఆర్మీ జవాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాలో తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అమీర్ ఖాన్ వారం రోజుల పాటు కాకినాడలో ఉండనున్నారని తెలుస్తోంది.