ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు అంటారు. ఆయన తీసుకు వచ్చిన ఎన్నో వినూత్న పథకాలతో పేద ప్రజల్లో వెలుగు నింపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోవొడిదుడుకులు ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో తనదైన స్టైల్లో అధికార పక్షాన్ని ఎండగట్టేవారు. ఇక తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతు పక్షపాతిగా, పేదల పెన్నిధిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రజల మనిషి మాత్రమే కాదు.. స్నేహ సంబంధాలకు ఎంతో విలువ ఇచ్చే మహన్నత వ్యక్తి కూడా. ఈ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు.. ఒక దశలో ఆయన ఆత్మగా పేర్కొన్న వ్యక్తి కెవిపి రామచంద్రరావు. రాష్ట్ర రాజకీయాలను వై.ఎస్ ఒంటి చేత్తో శాశించిన రోజుల్లో కూడా.. కెవిపి చెప్పిందే వేదంగా నడిచింది. అంతగొప్పగా సాగింది వీరిద్దిరి స్నేహబంధం.
రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత పరిస్థితిల్లో మార్పు వచ్చింది. స్నేహితుడి కోసం ప్రాణమిచ్చే కెవిపి.. తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అలా.. వై.ఎస్ కుటుంబానికి దూరమయ్యారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ ఈ విషయంలో కెవిపి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. “మీరెందుకు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దూరంగా వచ్చేశారు? పొలిటికల్ గా జగన్ ని ఎందుకు దగ్గర ఉండి గైడ్ చేయలేదు”? అంటూ ప్రశ్నించారు. దీనికి.. కెవిపి కాస్త భావోద్వేగంగానే సమాధానం ఇచ్చారు.
“ఇది చాలా వ్యక్తిగత విషయం.. అసలు ఆ కుటుంబానికి నేను అండగా లేనని ఎందుకు అనుకున్నారు. రాజకీయంగా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది వేరు, అండగా ఉండటం అనేది వేరు. దురదృష్టవశాత్తు జగన్ తో ఉండి, అతన్ని పొలిటికల్ గా గైడ్ చేయలేకపోయాను. అంతే తప్ప.. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో వ్యక్తిగత విబేధాలు లేవు” అని కెవిపి స్పష్టం చేశారు. కాగా, సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో కెవిపి తీసుకున్న స్టాండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.