చెన్నై- తమిళనాడులో రాజకీయాలకు, సినిమా వాళ్లకు ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్నవాళ్లంచా చాలా వరకు సినిమా రంగం నుంచి వచ్చినవాళ్లే. కరుణానిధి, జయలలిత ఆ కోవకే చెందుతారు. కాని ఇప్పుడు తమిళనాడులో సినిమా వాళ్లకు, రాజకీయపార్టీలతో వివాదం చెలరేగుతోంది. ప్రధానంగా బీజేపీ పార్టీకి, సినిమావాళ్లకు అస్సలు పడటం లేదు.
భారతీయ జనతా పార్టీకి, తమిళ సినీ హీరోలకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమిళ హీరోలు విజయ్, అజిత్, సూర్యలతో తమిళనాడు బీజేపీ పార్టీకి చాలా సందర్బాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో నీట్ సెలక్షన్ విధానం వల్ల తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతారని సూర్య ఎప్పట్నుంచో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న సినిమాటోగ్రఫీ బిల్లుపై కూడా హీరో సూర్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో సూర్యపై తమిళనాడు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం హీరో సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశం తరువాత తమిళ బీజేపీ నేతలు సూర్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సూర్య తన సినిమాల గురించి మాత్రమే చూసుకోవాలని హితువు పలికారు.
ఇతర విషయాలపై అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండాలని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వారు సూచించారు. ఇక ఇదే రీతీలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పాల్పడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హీరో సూర్యను గట్టిగా హెచ్చరించారు. బీజేపీ నేతల హెచ్చరికలపై సూర్య ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.