హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైళిపై బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకంపై కేసీఆర్ మాటలు.. నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నచందంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలని చెప్పడం ద్వారా హుజూరాబాద్‌లో గెలవలేని పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని విజయశాంతి అన్నారు.
అంతే కాదు గెలవలేని పార్టీలు హామీలు ఇవ్వంగా లేంది, టీఆర్ఎస్ హామీలు ఇస్తే తప్పేంటని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేసిన విజయశాంతి, మరి హుజూర్ నగర్, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికల హామీలు యాడపాయె అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్న ఈ ముఖ్యమంత్రి అందుకు నిధులేడకేల్లి కేటాయించుకున్నారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఇంకా కేసీఆర్‌ను విశ్వసించటమంటే తుపాకీ రాముడు మాటలకు, తుగ్లక్ వాగ్దానాలకు చెవొగ్గే మూర్ఖత్వమే అని ఆమె ఎద్దేవా చేశారు.
కేవలం హూజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కేసీఆర్ దళిత బంధు పధకాన్ని హుజూరాబాద్ లో ప్రకటించారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గప్పిస్తున్నాయి. ఐతే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు ఇస్తున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ చేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు విజయశాంతి తప్పుబడుతున్నారు.