స్పోర్ట్స్ డెస్క్- ఇండియన్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది బీసీసీఐ. కొవిడ్ కారణంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీ 2022 టోర్నీ ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. రంజీ ట్రోఫీ 2022 టోర్నీ ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
మొత్తం రెండు దశల్లో జరగనున్న ఈ టోర్నీలో మొదటి దశ ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు, రెండవ దశ మే 30 నుంచి జూన్ 26 వరకు జరగనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. రంజీ ట్రోఫీ 2022 టోర్నీలో భాగంగా టోటల్ 38 జట్లు 9 గ్రూపులుగా విభంజించారు. మొత్తం 62 రోజుల పాటు దేశంలోని 9 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, కోల్‌కతా, రాజ్‌కోట్, ఢిల్లీ, గౌహతి, కటక్, త్రివేండ్రం, చెన్నై, హర్యానాలో టోర్నీ జరగనుంది.
ఈ టోర్నీలో భాగంగా 64 మ్యాచ్ లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రంజీ సీజన్ జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో టోర్నీని కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు.
ఇక ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రంజీ ట్రోఫీ 2022 టోర్నీని రీ షెడ్యూల్ చేసింది బీసీసీఐ. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.