స్పోర్ట్స్ డెస్క్- బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఒకప్పుడు పసికూన అని పిలిచేవారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీం పెద్దగా గెలవలోకపోయేది. కానీ,ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టంటే మిగతా జట్లకు కాస్త భయం పట్టుకుంది. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ జట్టు క్రికెట్లో సాధిస్తోన్న విజయాలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మొన్నా మధ్య క్రికెట్ చరిత్రలో ఐదు ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన క్రికెట్ దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి 5 టీ20ల సిరీస్‌ను ఏకంగా 4-1తో ఎగరేసుకుపోయింది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.
ఇక తాజాగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20లోనూ విజయం సాధించింది. సెప్టెంబరు 1న ఢాకా వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కి ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు న్యూజిలాండ్ జట్టుపై 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ విజయంతో బంగ్లాదేశ్ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి ఉంది. మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్లు నయీమ్ 39, లిట్టన్ దాస్ 33 పరుగులు చేశారు.
చివర్లో కెప్టెన్ మహ్మదుల్లా 37 పరుగులు నాటౌట్ తో రాణించాడు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. ఆ తరువాత 142 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.