పొలిటికల్ డెస్క్- బండ్ల గణేష్.. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత.. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. రాంగోపాల్ వర్మ టైపులో బండ్ల గణేష్ ఏంమాట్లాడినా అది సంచలనమే అవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండ్ల గణేష్, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే పార్టీకి రాజానామా చేశారు. ఇక జన్మలో రాజకీయాల్లోకి రానని శపధం కూడా చేశారు.
కానీ మాట మీద నిలబడితే ఆయన బండ్ల గణేష్ ఎందుకు అవుతారు. అందుకే ఇప్పుడు మళ్లీ మాట మార్చారు బండ్ల గణేష్. మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లాలన్న తన మనసులోని మాటను బయటపెట్టారు. అది కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలన్న ఆసక్తిని కనబరిచారు. అవును తనకు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని ఉందని బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి బండ్ల గణేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, బండ్ల గణేష్‌ల మధ్య ఆసక్తికరమైన సంభాషన జరిగింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనాలని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను అక్కడే ఉన్న ఓ కాంగ్రెస్ నాయకుడు కోరారు. దీనికి స్పందించిన బండ్ల గణేష్, రేవంత్ అన్న ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని సమాధానం ఇచ్చారు. రేవంత్‌రెడ్డి పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్నందున, మీరు కూడా పార్టీలో యాక్టీవ్ రోల్ పోషిస్తే పార్టీకి మేలు చేస్తుందని సదరు నేత బండ్ల గణేష్‌కు సూచించారు.
అందుకు బండ్ల గణేష్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అంతే కాదు త్వరలోనే కలిసి మాట్లాడదామని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బండ్ల గణేష్ కు చెప్పినట్లు సమాచారం. అదన్నమాట సంగతి. అన్నీ కుదిరితే త్వరలోనే బండ్ల గణేష్ మెల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్నమాట. అందుకే అన్నారు రాజకీయా నాయకులు, సినిమా వాళ్లు ఏం మాట్లాడినా రెండు మూడు అర్ధాలు ఉంటాయని.