బండ్ల గణేష్.. వివాదాలకు కెరాఫ్ అడ్రెస్‌లా ఉంటాడు. నిత్యం ఏదో వివాదంలో ఆయన పేరు నానుతూనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల జాబితాలో.. బండ్ల గణేష్ పేరు ముందుగా వస్తుంది. సందర్భం వచ్చిన ప్రతి సారి పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటాడు బండ్ల గణేష్. పవనేశ్వర అంటూ జనసేనానిపై తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అయితే గత కొన్ని రోజులుగా బండ్ల గణేష్ తీరులో మార్పు వచ్చింది. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న పోస్ట్‌లు కూడా అలానే ఉంటున్నాయి. ఇక కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ నా దేవుడు అని కామెంట్స్ చేసి.. పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు బండ్ల గణేష్.
ఇక దర్శకుడు త్రివిక్రమ్ గురించి గతంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మరోసారి త్రివిక్రమ్‌ని టార్గెట్ చేసి.. ఇండైరెక్ట్‌గా కామెంట్స్ చేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఆ వివరాలు..తాజాగా మరో ఇంటర్వ్యూలో.. త్రివిక్రమ్ మీద తన అసంతృప్తిని బయటపెట్టేశాడు బండ్ల గణేష్. నేరుగా త్రివిక్రమ్ పేరెత్తకుండా ‘గురూజీ’ అని సంబోధిస్తూ.. ఆయనపై విమర్శలు చేశాడు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “నిజమైన పవన్ కళ్యాణ్‌ని బయటికి తీసింది నేను. ఆయనకు విపరీతమైన టాలెంట్ ఉంది. ఈయన మామూలు మనిషి కాదురా బాబూ.. ఈయన అతీతమైన వ్యక్తి. వేరే స్థాయిలో ఉండాలి.. అని పవన్ గురించి అనుకున్నది నేను. ఇప్పుడు చాలామంది గురూజీలు, బరూజీలు అని వచ్చారు తప్పితే.. నాకు తెలియదు.. అది వేరే విషయం. దాన్ని పక్కకు పెట్టండి. నాకు ఈ రోజుకు కూడా పవన్ గారి మీద ఒక కృతజ్ఞత ఉంటుంది. అలానే వాళ్లు కూడా నా మీద కృతజ్ఞత చూపించాలని నేననుకోను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. దీనిపై పవన్ ఫ్యాన్స్, త్రివిక్రమ్ అభిమానులు మండి పడుతున్నారు.