అమరావతి- ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ నడుస్తోంది. వరుసగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తుండటం ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఈ ఇష్యూలోకి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఎంటరవ్వడంతో మరింత రసకందాయంలో పడింది వ్యవహారం.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వెక్కివెక్కి ఏడ్చిన ఘటన ఎంతటి సంచలనం రేపిందో అందరికి తెలుసు. ఈ ఇష్యూలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ అంసంపై ఎన్టీఆర్ స్పందించాలని టీడీపీ నేతలు కోరడంతో ఆయన రియాక్ట్ అయ్యారు.
రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదని, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం మన సంస్కృతి కాదని చెబుతూ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. ఇదిగో ఇక్కడే వచ్చింది మరో సమస్య. టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఎన్టీఆర్ మాటలను తప్పుబట్టారు. ఎన్టీఆర్ పిరికి ధోరణిలో మాట్లాడారని, సింహంలా గర్జిస్తాడనుకుంటే చాగంటి కోటేశ్వరరావులా ప్రవచనాలు పలికారంటూ వ్యాఖ్యానించారు.
ఇలా ఒకరి తరువాత మరొకరు టీడీపీ నేతలు ఎన్టీఆర్ వైఖరిని తప్పబడుతూ మాట్లాడుతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే.. భరత్ మాత్రం ఆయనను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఎన్టీఆర్ చాలా పరిణతితో కూడిన వాదన వినిపించారని, ఆయన స్పందించిన విధానం పూర్తిగా స్వాగతించ దగినదని భరత్ అన్నారు.
దీని గురించి చర్చించడం సరికాదన్న భరత్, ఈ ఘటనపై స్పందించినందుకు ఎన్టీఆర్ ను అభినందించాలని చెప్పారు. మరి భరత్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.