అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొంత మందిని దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ పనిగట్టుకుని కక్ష్య సాధిస్తోందని, అందులో భాగంగానే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలు రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది. ఆ సమావేశంలో సినిమా టికెట్ ధరలు, అదనపు షోలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సమావేశానికి ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెళ్లకపోవడం ఆసక్తిరంగా మారింది.దీనిపై బాలకృష్ణ సన్నిహితుల దగ్గర స్పందించారని, సినిమా టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసే ప్రసక్తే లేదని కామెంట్ చేసినట్లు ప్రచారం జరిగింది. సినిమా టిక్కెట్ ధరలు తక్కువగా ఉన్నసమయంలోనే తన సినిమా అఖండ సూపర్ హిట్ అయిందంటూ బాలకృష్ణ కామెంట్ చేసినట్లు కూడా చర్చ జరిగింది. ఐతే హిందూపురం జిల్లా కోసం సీఎం జగన్ ను కలుస్తానని బాలయ్య గతంలో అన్నారు.
నందమూరి బాలకృష్ణ కామెంట్స్‌పై తాజాగా ఏపీ సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. అఖండ సినిమా విడుదలకు ముందు జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అఖండ సినిమా విడుదల సమయంలో ఆ సినిమా నిర్మాతలు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావు, మరో ఇద్దరు కాంట్రాక్టర్ల సాయంతో తనకు ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ అడిగారని పేర్ని నాని చెప్పారు.వారికి తాను అపాయింట్ మెంట్ ఇవ్వగా, విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వచ్చి తనను కలిశారని, నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసి, రింగ్ అవ్వగానే వెంటనే ఫోన్ పెట్టేశారని తెలిపారు. ఎందుకలా చేశారని తాను అడగ్గా, బాలకృష్ణ మంచి ముహూర్తం చూసుకుని ఫోన్ చేస్తారని వారు చెప్పినట్లు మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. వాళ్లు చెప్పినట్టే కాసేపటికి ముహూర్తం చూసుకొని బాలకృష్ణ ఫోన్ చేసి తనతో మాట్లాడారని, సీఎం జగన్ ను తాను కలవాలనుకుంటున్నాని, అపాయింట్‌మెంట్ ఇప్పించాలని బాలకృష్ణ కోరినట్లు పేర్ని నాని వివరించారు.
ముఖ్యమంత్రి జగన్ తో బాలకృష్ణ అపాయింట్‌మెంట్ కోరిన సంగతి చెప్పినట్లు పేర్ని నాని తెలిపారు. ఐతే బాలకృష్ణ వస్తే ఆయన క్యారెక్టర్ పోతుంది, ఆయనకు ఏం కావాలో మీరే చేయాలని సీఎం జగన్ తనకు సూచించినట్లు మంత్రి చెప్పారు. తాను చెప్పిందంతా అక్షర సత్యమని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని కూడా మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు.
Cm @ysjagan Gave Huge Respect To His Favourite Hero #BalaKrishna Garu 👌👏. #Akhanda pic.twitter.com/fe6vXdY6JM
— Sai Mohan ᴿᴿᴿ 🌊 (@Sai_Mohan_999) February 25, 2022