ఫిల్మ్ డెస్క్- అన్ స్టాపబుల్.. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వస్తున్న ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ షోను హోస్ట్ చేసేది నందమూరి బాలకృష్ణ కాబట్టి. అవును బాలయ్య బాబు తనదైన స్టైల్లో సినీ సెలబ్రెటీలను ఇంటర్య్వూ చేసి అందరిని అలరిస్తున్నారు. వచ్చిన గెస్ట్ లను సూటిగా, నిక్కచ్చిగా, సరదాగా బాలకృష్ణ అడిగే ప్రశ్నలు, ఆయన అడిగే విధానం బావుందని అంతా అంటున్నారు.
ఇదిగో ఈ క్రమంలో అన్ స్టాపబుల్ షోకి దగ్గుబాటి రానా వచ్చారు. రానాను బాలకృష్ణ ప్రశ్నలు అడగడంతో పాటు, రానా సైతం బాలకృష్ణను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యంగా భార్య కాళ్లు పట్టుకోవడంపై చర్చ జరిగింది. దీనికి బాలయ్య బాబు చెప్పిన సమాధానం అందరికీ నవ్వు తెప్పించింది. అన్ స్టాపబుల్ షోలో అసలేం జరిగిందంటే..
అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ, రానా దగ్గుబాటి మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే రానాను బాలకృష్ణ బాగానే ఆటపట్టించినట్లు కనిపిస్తుంది. ఈ ఇంటర్వ్యూ సాగే క్రమంలో రానా కూడా బాలయ్యను కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తుంది. మీ శ్రీమతితో గొడవ పడినప్పుడు మీలో ఎవరు ముందు సారీ చెబుతారు.. అని రానా అడిగినప్పుడు, ఏ మాత్రం ఆలస్యం చేసుకుండా.. బాలకృష్ణ నేనే సారి చెబుతా అన్నట్లు ఓ షో కార్డ్ చూపించారు.
ఇదిగో ఈ క్రమంలో మీరెప్పుడైన భార్య కాళ్లు పట్టుకున్నారా..అని రానా అడిగారు. దీనికి చిన్న షాక్ కు గురైనట్లు ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన బాలకృష్ణ, వెంటనే తేరుకుని.. నీకెందుకయ్యా అని సరదాగా రివర్స్ అయ్యారు. ఆ తరువాత రాగా ప్రశ్నకు సమాధానం చెబుతూ.. కృష్ణుడు అంతటివాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు.. బాలకృష్ణుడెంత.. అని అనడంతో షోలో రానాతో పాటు అంతా నవ్వేశారు. అన్ స్టాపబుల్ లో రానాను బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూ జనవరి 7న ఆహాలో వస్తుంది.