హైదరాబాద్- ఆయన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు.. ఆమె తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్. కానీ ఓ వేడుకలో ఇద్దరు కలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరు ఎవరో మీరు గెస్ చేసే ఉంటారు. అవును నందమూరి బాలకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఇవాళ సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి జన్మదినోత్సవం.
ఈ సందర్భంగా మేయర్ తన పుట్టిన రోజు వేడుకలు బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బాలకృష్ణ దగ్గరుండి విజయలక్ష్మి చేత కేక్ కట్ చేయించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. క్యాన్సర్ రోగులకు బసవతారకం ఆస్పత్రి ద్వార చికిత్స అందిస్తున్న బాలకృష్ణను మేయర్ విజయలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిబసవతారకం ఆస్పత్రిలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఇవ్వాలని ఎప్పటికీ కోరుకుంటున్నానన్నారు బాలకృష్ణ. ఈ సందర్బంగా గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.