బెంగళూరు- తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక్క తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న వచ్చిన ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి జీవించారు. ఈ సినిమాతో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది.
విజయ్ సేతుపతి దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విజయ్ సేతుపతిపై దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక గుర్తుతెలియని ఆగంతకుడు విజయ్ సేతుపతిని ఎగిరి తన్నాడు. ఆయన చుట్టూ భద్రత సిబ్బంది ఉన్నప్పటికీ ఆ వ్యక్తి దాడికి పాల్పడటం గమనార్హం.
తనపై దాడి జరగడంతో ఒక్కసారిగా ఆయన షాక్ కు గురయ్యారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి విమానం దిగి ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఐతే ఆగంతకుడు దాడి చేయడానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి పిర్యాదు అందలేదని బెంగళూరు ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే విజయ్ సేతుపతిపై దాడి జరగవచ్చని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. తనపై దాడి జరిగిన ఘటనపై విజయ్ సేతుపతి స్పందించలేదు. ఈ ఘటనపై శాండల్ వుడ్ నటులు సైతం నోరు మెదపడం లేదు.